వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికాగా అధికారపార్టీ నేతలపై మండిపడ్డారు. ఇటీవల ఫరూక్ అబ్దుల్లా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని..  వైసీపీ అధినేత జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఆరోపణలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

‘‘ఫరూఖ్ అబ్దుల్లా కూతురిని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పెళ్లి చేసుకున్నాడు. పేరుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అయినా ఆయన వియ్యాలు, పొత్తులు అన్నీ కాంగ్రెస్ తోనే. రాహుల్ తో జత కట్టిన తర్వాత చంద్రబాబు ఫరూఖ్ కు చుట్టమై పోయాడు. మరి ఇంతకంటే ఏం మాట్లాడతాడు.’’ అని పేర్కొన్నారు.

‘‘మూడు తరాల కుటుంబ పాలనలో కశ్మీర్‌ను తీవ్రవాదం కోరల్లోకి నెట్టిన చరిత్ర ఫరూఖ్ అబ్దుల్లాది. చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వచ్చి బందిపోటు దొంగకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకున్నాడు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్బుల్లో కాలక్షేపం చేసే ఈ పెద్దాయన కశ్మీర్‌ ప్రజలకు దూరమై చాలా కాలమైంది.’’ అని ఆరోపించారు.

అనంతరం కేఏ పాల్ గురించి మాట్లాడుతూ...‘‘కెఎ పాల్ కుప్పిగంతులకు కారణం ఇప్పడు అర్థమైందా? ప్రజాశాంతి పార్టీని చంద్రబాబుకు అప్పగించినందుకు 500 కోట్లు ముట్ట చెప్పారు. అమెరికా నుంచి కట్టుబట్టలతో తరిమేసిన తర్వాత పాల్ మళ్లీ బిలియనీర్ అయిపోయాడు.దోచుకున్న లక్షల కోట్లను చంద్రబాబు ఎలా పంచిపెడుతున్నాడో చూడండి’’ అని విజయసాయి రెడ్డి అన్నారు.