ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. పవన్, చంద్రబాబులపై మండిపడ్డారు.

‘‘పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో, టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయనకు ఇల్లు కట్టిచ్చింది, హెలికాప్టర్లు సమకూర్చింది ఎవరో తెలియనంత అమాయకులేం కాదు ప్రజలు. ఆఖరికి మీ అభ్యర్థుల జాబితాను ఫైనల్‌ చేసింది కూడా ఆయన కాదా?’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో..‘‘గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది. సంతోషం’’ అని అన్నారు.

‘‘పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.’’ అని మరో ట్వీట్ చేశారు.

మీడియాను కూడా విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. ‘‘ పోలింగ్ పూర్తయ్యేదాకా ప్రజలంతా పచ్చ పత్రికలు, టీవీ చానళ్లను బహిష్కరించాలి. ప్రజలు ఛీ.పో అంటున్నా చంద్రబాబును ఎలాగోలా గట్టెక్కించడానికి అబద్ధాలు సృష్టిస్తున్నాయి. వివేకా హత్య కేసులో జగన్ అనుచరుడి అరెస్ట్ అని కుల మీడియా రాయడం విలువల పతనానికి పరాకాష్ఠ’’ అంటూ మరో ట్వీట్ చేశారు.