హైదరాబాద్‌: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి ఆదివారం లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా చంద్రబాబు ప్రజావేదిక ద్వారా పార్టీ కార్యక‍్రమాలు నిర్వహిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శిం్చారు. ప్రజావేదికలో ఎమ్మెల్యేలను పిలిచి టెలీ కాన్ఫరెన్స్‌లు, పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనమని ఆయన తెలిపారు. 

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు ఈసీ అనుమతితో చేయాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తమకు తెలియదని, ఈ విషయంపై సీఈసీ వెంటనే జోక‍్యం చేసుకోవాలని ఆయన అన్నారు.

విజయసాయి రెడ్డి లేఖ పాఠం ఇదే..

"ప్రజా వేదిక ప్రభుత్వ సముదాయం దానిని పార్టీ అవసరాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు వాడుతున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను పార్టీ అవసరాలకి ఉపయోగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఒక పార్టీ మాత్రమే ఈ సదుపాయాలను ఉపయోగించుకోవడం సమంజసం కాదు. ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు, వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను మిగిలిన పార్టీలకు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించాలి. ఆయా సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? లేదా..? మాకు తెలియజేయండి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఈ సంఘటనలపై సమీక్షించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు పరిచేలా స్పష్టమైన ఆదేశాలు ఇవండి"