విజయనగరం: విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదారామారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. 

వెనువెంటనే మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు, మాజీ కేంద్రమంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో వాసిరెడ్డి వరదా రామారావు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందారు. 

ఆ తర్వాత ఎమ్మెల్సీగానూ పని చేశారు. అయితే 2017 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మే నెలలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం విజయనగరం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వాసిరెడ్డి వరదారామారావుకు బొబ్బిలి నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ బొబ్బిలి నియోజకవర్గంలో విజయం సాధించాలని మంచి పట్టుదలతో ఉంది. అలాంటి తరుణంలో వాసిరెడ్డి వరదారామారావు ఊహించని ట్విస్ట్ ఇవ్వడం వైసీపీని కలవరపాటుకు గురిచేసింది.