వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు. అధికారంతో కోర్టుల్ని, పోలీసుల్నీ గ్రిప్పుల్లో పెట్టుకుని వైఎస్ వివేకా హత్య కేసును జగన్‌ చుట్టూ తిప్పేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు జరిగిన హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పద్మ స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబసభ్యులను హంతకులుగా, నేరస్తులుగా చిత్రించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారన్నారు. బీసీ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ఆమోదం తెలపకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పద్మ మండిపడ్డారు.

ఒక సీఐకి ముఖ్యమంత్రి భయపడిపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వరని, ఆ సామాజికవర్గానికి ఎలాంటి మేలు చేయలేదని వైసీపీ ఎన్నికల్లో అవకాశమిస్తే దానిని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని వాసిరెడ్డి ఆరోపించారు.

టీడీపీ-జనసేనకి మధ్య ఒప్పందం ఉందని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి జనసేన ఆయా స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతోందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో మహాకూటమితో చావు దెబ్బ తిన్న చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో ముసుగు కూటమిని రంగంలోకి దించారని పద్మ ఆరోపించారు.

ముసుగు కూటమిలో జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీఎస్పీ, కేఏ పాల్ సభ్యులుగా ఉన్నారని వాసిరెడ్డి ఆరోపించారు.