కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సొంతగూటికి చేరుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వలేదు. ప్రత్తిపాడు టికెట్ ను ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కాకుండా మనవడు వరుపుల రాజాకు ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 

అనంతరం సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన తోడల్లుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తారని చెబితేనే తాను టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. 

తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తనకు మూడుసార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గత ఎన్నికల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. వైఎస్ కుటుంబం వల్లే తాను రెండు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. 

అలాంటి వ్యక్తుల గుర్తింపు మరిచిపోయి పార్టీ ఫిరాయించి పొరపాటు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మనవడే కదా అని వరుపుల రాజాను చేరదీస్తే తనకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడంటూ వాపోయారు. వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే ఇంత ద్రోహం చేస్తాడని ఊహించలేదన్నారు. 

తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వైసీపీలో తనకు ఎటువంటి పదవులు వద్దని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో కష్టపడి పనిచేస్తాని వరుపుల సుబ్బారావు వెల్లడించారు.