విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

చంద్రబాబుతో భేటీ తర్వాతనే వంగవీటి రాధా టీడీపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన డిమాండ్లపై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీలు లభించిన తర్వాత సైకిలెక్కాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధాకు నర్సారావుపేట లేదా అనకాపల్లి టికెట్ ఖరారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి వంగవీటి రాధా విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన టీడీపిలో చేరవచ్చునని భావించారు. కానీ అందులో జాప్యం జరిగింది. 

వంగవీటి రాధా ఇటీవల వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కొడాలి నానిని కలుసుకోవడంపై కూడా రాజకీయాల్లో చర్చ జరిగింది. చివరకు ఆయన టీడీపిలో చేరాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.