అమరావతి: ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సైకిలెక్కేశారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ కండువాకప్పి వంగవీటి రాధాను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

మచిలీపట్నం ప్రస్తుత ఎంపీ కొనకళ్ల నారాయణ పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. వంగవీటి రాధాతోపాటు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీనేత యడం బాలాజీ సైతం టీడీపీలో చేరారు. 

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకోసం ఎంతో కష్టపడ్డానని అలాంటిది తీరా ఎన్నికల సమయానికి తనను కాకుండా వైసీపీకి బద్దశత్రువుగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను పార్టీలోకి ఆహ్వానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ కేటాయింపులో పునరాలోచించుకోవాలని కోరారు. అయితే చీరాల టికెట్ ఆమంచి కృష్ణమోహన్ కే ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.