అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. వెన్నుపోటు పొడవడంలో వైఎస్ జగన్ ను మించిన వారు ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం రాత్రి ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధా. టీడీపీ కండువాకప్పి రాధాను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా వైఎస్  జగన్ పై మండిపడ్డారు రాధా. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైఎస్ జగన్ కు మళ్లీ ప్రతిపక్ష హోదా కట్టబెట్టబోతున్నారంటూ జోస్యం చెప్పారు. రాజ్యాలున్నాయి పరిపాలిద్దామనే ఆరాటం వైఎస్ జగన్ ది అంటూ నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ పోరాటంలో ఎవరికెవరికో గిఫ్టులు కాదు మన ప్రజలకు మనమే గిఫ్టులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్‌ స్విచాఫ్‌ చేయాలనే నినాదంతో ముందుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని నిలదీశారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌ వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. 

అంతకంటే వెన్నుపోటు ఉంటుందా అంటూ రాధా మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్‌ మారాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు  వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నాయుడు నెరవేర్చారంటూ కితాబిచ్చారు. 

విజయవాడలోని నిరుపేదలందరికీ శాశ్వత పట్టాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ పెడన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ సమాచారం.