విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు మాజీఎమ్మెల్యే, టీడీపీ స్టార్ కాంపైనర్ వంగవీటి రాధా. చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ విజయవాడలోని కేజే గుప్తా కళ్యాణ మండపంలో  శ్రీయాగం నిర్వహించారు. 

వంగవీటి రాధా సోదరి ఆషా దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈయాగం ఏప్రిల్ 3 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. గోపూజ, వాస్తు హోమం అనంతరం దుర్గామత పూజతో ప్రారంభమైన శ్రీయాగం మూడు రోజులుపాటు కొనసాగి పూర్ణాహుతితో ముగిస్తుందని రుత్వికులు తెలిపారు. 

శ్రీయాగం ద్వారా శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుందని రుత్వికులు స్పష్టం చేశారు. ప్రజల సుఖసంతోషాలు, నదీజలాల పరిరక్షణ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అపర భగీరథుడు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీయాగం చేయిస్తున్నట్లు వంగవీటి రాధా తెలిపారు.