కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఘోరంగా పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిత. 

2019 ఎన్నికల్లో అసమ్మతి సెగ తగలడంతో వంగలపూడి అనితకు పాయకరావుపేట టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు చంద్రబాబు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు టికెట్ కేటాయించారు. 

కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. ఇకపోతే 2014 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేఎస్ జవహర్ పోటీచేసి గెలుపొందారు. 

అనంతరం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు కొవ్వూరులో అసమ్మతి సెగ తగలడంతో ఆయనను కృష్ణా జిల్లా తిరువూరు టికెట్ ఇచ్చారు. అసమ్మతి సెగ కారణంతో రెండు చోట్ల చంద్రబాబు నాన్ లోకల్ అభ్యర్థులను బరిలోకి దించారు. ఇలా నాన్ లోకల్ స్థానాల్లో పోటీ చేసిన ఇరువురు ఓటమి పాలయ్యారు.