హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ వేత్త మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగా గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. 

ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వంగాగీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పిఠాపురం నియోజకవర్గంతోపాటు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. 

మరోవైపు నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

వర్గపోరుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అచేతనంగా మారిపోయిందని దానికితోడు వైసీపీ బలంగా వేళ్లూనుకుపోవడంతో ఆయన పోటీపై పునరాలోచనలో పడ్డ ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా లేదా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.