వైఎస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి సూచించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి... జగన్ కి పలు సూచనలు చేశారు.

‘హిట్ పిక్చర్ అని ప్రచారం జరిగిన సినిమా.. కొంత తేడా వచ్చినా బాగోలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా కొంచెం బాగోలేక పోయినా బాగుందని అంటారు. జగన్, ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా.. దాన్ని ప్రజలు పెద్ద తప్పుగానే చూస్తారు. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్లాలి.’ అని సూచించారు.

‘‘విప్లవాత్మక మార్పులకు జగన్‌ వ్యాఖ్యలు నాంది. ఇసుక మాఫియాను మొదట అరికట్టాలి. గతంలో అవినీతి నిర్మూలనపై మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి కూడా కొన్ని సలహాలు ఇచ్చాను. ప్రతి ప్రభుత్వం ఆఫీస్ ముందు అక్కడ పనిచేస్తున్న వాళ్ల జీతాల వివరాలను బోర్డు మీద రాయాలి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఉద్యోగులు ప్రజల జీతంతో పనిచేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియాలి. నేను చెప్పిన విషయం ఆయన నచ్చింది. కానీ ఆయన పక్కన ఉన్న ఆఫీసర్స్‌కు నచ్చలేదు. ఇప్పుడు కూడా నా సూచనపై ఆలోచించాలి’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.