ఏపీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి మాజీ సీఎం చంద్రబాబు ఇంకా కోలుకోనేలేదు. అంతలోనే పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారం చేజిక్కుంచుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో... టీడీపీ నేతలు ఒక్కొరొక్కరుగా పార్టీ వీడేందుకు రెడీ అయిపోతున్నారు.

కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన శాలివాహన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, ఆయన సతీమణి జెడ్పీటీసీ వరలక్ష్మి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా నాగేంద్ర దంపతులతో వారి అనుచరులు, అభిమానులు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
 
కాగా.. ఇదే కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కూతురు, ఆస్పరి జడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆమె భర్త దేవనకొండ ఎంపీపీ రామచంద్రనాయుడు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో ఆయన స్వగృహంలో వారు ఆదివారం చర్చలు జరిపారు.

ప్రస్తుతం గ్రేడ్ 2 నాయకులు మాత్రమే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని... జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందనే వాదన వినపడుతోంది.