ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలో నిలవబోతోంది. అవును అది కూడా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ నుంచి. కేసీఆర్‌కు వీరాభిమాని అయిన కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి తాను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరి కాయలు కొట్టి ఈయన వార్తల్లోకి ఎక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోకాళ్లతో ఇంద్రకీలాద్రి కొండ ఎక్కారు.

బెజవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ఆదినారాయణ... టీఆర్ఎస్ టికెట్‌పై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పానన్నారు.

ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతో పాటే తాను కేసీఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పోటీ చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రాలో టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో అక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తామని అటువంటి సందర్భాల్లో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా ‘‘తెలుగు రాష్ట్ర సమతి’’ అని మారుస్తామన్నారు.