ఏపీ ఎన్నికలకు ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో...బాలయ్య సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట.

సినీ హీరోగా ప్రేక్షకులను అలరించిన బాలయ్య గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాగా... ఆయన వ్యక్తిగతంగా సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా... ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన ఓ సెంటిమెంట్ ని బాగా నమ్ముతున్నారు.

2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. కౌంటింగ్‌ సమయంలో 2014లోనూ ఆర్డీటీ స్టేడియంలో బాలకృష్ణ బస చేశారు. అదికూడా స్టేడియంలోని 9వ నెంబర్‌ గదిలో బస చేశారు.
 
తాజాగా.. మరోసారి అదే హిందూపురం నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా టీడీపీ తరపున బరిలోకి దిగారు. మళ్లీ కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో నిర్వహిస్తున్నారు. బాలయ్య కౌంటింగ్‌కు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉన్న గదిలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ఆర్డీటీ మరొకరికి ఆ గదిని కేటాయించింది. 

అయితే బాలయ్య కోరిక మేరకు ఆ గదిని ఖాళీ చేయించారు. రూమ్‌ నెంబర్‌ 9ని బాలయ్యకే కేటాయించి బసకు సిద్ధం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియంకు బాలకృష్ణ చేరుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తీ చేశారు.