అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈనెల 30న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్ తోపాటు మంత్రులుగా ఎవరెవెరు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

వైయస్ జగన్ తోపాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు..ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇస్తారు...ఏయే జిల్లాలకు మెుదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. 

వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట నడిచిన వారికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరిగింది. 2011లో వైయస్ జగన్ తోపాటు కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలుగా ఉన్న 16 మంది తమ ఎమ్మెల్యే పదవులను పణంగా పెట్టి జగన్ కు జై కొట్టారు. 

అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు గెలుపొందారు. అయితే అలా జగన్ కోసం ఎమ్మెల్యే పదవులను సైతం తృణపాయంగా వదిలేసిన వారిలో అత్యధిక మందికి మంత్రి పదవులు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతుంది. 

వాస్తవానికి వైయస్ జగన్ కేబినెట్ లో 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కుల, సామాజిక, ప్రాంతాల వారీగా జగన్ కేబినెట్ లో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలా జరిగితే ఆ 16 మందిలో కేవలం నలుగురికి మాత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 

ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పలువురికి మంత్రి పదవులను ఆఫర్ చేశారు కూడా. ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఈఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. 

ఇకపోతే మంత్రి నారా లోకేష్ పై పోటీ చేసిన మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేసి మంగళగిరికి పంపుతానని జగన్ హామీ ఇచ్చారు. వీరితోపాటు చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి విడదల రజనిని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

చిలకలూరిపేట టికెట్ ను త్యాగం చేసినందుకు ఆయన సేవలను గుర్తిస్తూ కేబినెట్ పదవి ఇవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇకపోతే వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సైతం మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

మంత్రులుగా కేవలం 25 మందికే అవకాశం ఉంది. కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 స్థానాలకు గానూ 151 స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆశావాహులు మాత్రం తమకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఆశాహులను పరిశీలిస్తే

1. శ్రీకాకుళం  

1. ధర్మాన ప్రసాదరావు( శ్రీకాకుళం)
2.  కళావతి (పాలకొండ)
3. రెడ్డి శాంతి (పాతపట్నం)
 
2. విజయనగరం
 
1. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి) 
2. పాముల పుష్ప శ్రీవాణి(కురుపాం) 
3.  రాజన్నదొర(సాలూరు) 

3. విశాఖపట్నం 
1. గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి) 
2. గొల్ల బాబూరావు (పాయకరావుపేట) 
3. ముత్యాలనాయుడు(మాడుగుల) 

4. తూర్పుగోదావరి

1. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌(ఎమ్మెల్సీ కోటా) 
2. పినిపే విశ్వరూప్(అమలాపురం)
3. కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌) 
4. దాడిశెట్టి రాజా(తుని) 

5. పశ్చిమగోదావరి 
1. ఆళ్ల నాని(ఏలూరు) 
2. తెల్లం బాలరాజు (పోలవరం) 
3. తానేటి వనిత(కొవ్వూరు) 
4. గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం) 

6. కృష్ణా 
1. పేర్ని నాని(మచిలీపట్నం) 
2. సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట) 
3. పార్థసారథి(పెనమలూరు) 
4. మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు(నూజివీడు) 

7. గుంటూరు  
1. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి) 
2. మర్రి రాజశేఖర్‌(ఎమ్మెల్సీ కోటా) 
3. అంబటి రాంబాబు(సత్తెనపల్లి) 
4. కోన రఘుపతి(బాపట్ల) 

8. ప్రకాశం 

1. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు) 
2. ఆదిమూలపు సురేష్‌(యర్రగొండపాలెం) 

9. నెల్లూరు

1. మేకపాటి గౌతంరెడ్డి(ఆత్మకూరు) 
2. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి) 
3. ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) 

10. చిత్తూరు 

1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు) 
2. భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి) 
3. ఆర్కే రోజా సెల్వమణి (నగరి) 

11. కడప
 
1. శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి)
2. అంజాద్‌ బాషా(కడప).

12. కర్నూలు 

1. బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి(డోన్‌) 
2. శ్రీదేవి(పత్తికొండ) 
3. హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు) 

13. అనంతపురం 

1. అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం) 
2. కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం) 
3. శంకర్‌నారాయణ(పెనుగొండ).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 41 మంది మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆ 41 మందిలో 5మందికి జగన్ హామీ ఇవ్వగా మిగిలిన 20 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.