అమరావతి: నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అగ్రస్థానంలో ఉంటారంటూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓ పేరు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసిన సమయంలో ఆయన వెన్నంటి ఉన్న వారికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేశారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. 

సాక్షాత్తు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇదే అంశాన్ని ఇటీవలే స్పష్టం చేశారు. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. 

తండ్రి బాటనే వైయస్ జగన్ సైతం అనుసరిస్తారని ప్రస్తుత రాజకీయాల్లో చెప్పుకుంటారు. అందుకే వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో గానీ, బహిరంగ సభలలో గానీ నన్ను నమ్ముకున్న వారిని గుండెల్లో పెట్టుకుంటా వారికి మంచి భవిష్యత్ అందిస్తాను అంటూ పదేపదే చెప్పుకొచ్చేవారు. 

ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయి కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ ను వేధించిందని వైయస్ జగన్ కుటుంబ సభ్యులే ఎన్నోసార్లు ప్రస్తావించారు. 

ఆనాడు జరిగిన అవమానాలను తట్టుకోలేక వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి 2012లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆనాడు వైయస్ జగన్ వెంట దాదాపుగా 16 మంది శాసన సభ్యులు ఆయన వెంట నడిచారు. 

వైయస్ జగన్ కోసం ఎమ్మెల్యే పదవులను సైతం పణంగా పెట్టారు. ఆనాటి నుంచి వైయస్ జగన్ తో మెుదలైన వారి ప్రయాణం నేటికి కొనసాగుతోంది. వైయస్ జగన్ ను నమ్ముకుని వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా అంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. 

వైయస్ జగన్ కు మద్దతు ఇస్తున్నారనే నెపంతో ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణరంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, తెల్లం బాలరాజు, పేర్ని నానీ, తానేటి వనిత, కొడాలి నాని, పి.సాయిరాజ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. 

అనర్హత వేటువేసిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కొంతమంది గెలిచినా మరికొంతమంది ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం అనర్హత వేటుకు గురైన వారిలో చాలా మంది 2019 ఎన్నికల్లో గెలుపొందారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగిరమేష్, బాలరాజు, పేర్ని నాని, తానేటి వనిత, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, పి.సాయిరాజ్ లు గెలుపొందారు. వీరికి ఖచ్చితంగా జగన్ కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. 

మంత్రి వర్గ పరిశీలనలో కూడా వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరి ఆశలు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తారా లేక నీళ్లు చల్లుతారా అన్నది వేచి చూడాలి.