అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్లపై హైకోర్టు విచారించింది. 

ఇరు పిటీషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వచ్చేనెల అంటే ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీకానీ మీడియాలో,బహిరంగ సభలలో కానీ ఎక్కడా మాట్లాడొద్దంటూ సూచించింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు, అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తోపాటు వైసీపీ నేతలు సైతం వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడొద్దంటూ సూచించింది. మాట్లాడబోమని కోర్టుకు అంగీకార పత్రం ఇవ్వాలని ఆదేశించింది.

అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రభుత్వం వేసిన సిట్ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు సూచించింది. అయితే సిట్ అధికారులెవరూ మీడియా ముందు ప్రెస్మీట్ లు పెట్టి కేసు వివరాలు బహిర్గతం చేయరాదని ఆదేశించింది. అనంతరం తీర్పును ఏప్రిల్ 15కు వాయిదా వేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.