ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి తహాశీల్ధార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు తహాశీల్దార్ కార్యాలయానికి రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 

ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో వారిని పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్ వేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. 

ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువురిని సర్దిచెప్పడానికి పోలీసులు ప్రయత్నించినా వినకపోవడంతో లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.