కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన గౌరు చరితా రెడ్డి దంపతులకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టికెట్లు ఖరారు చేశారు. పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డితో పాటు ముఖ్య నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. 

పాణ్యం టికెట్‌ గౌరు చరితకు ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా నంద్యాల లోక్‌సభ స్థానం టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. గౌరు వెంకటరెడ్డి స్వయాన బావ, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. 

శివానంద రెడ్డి టికెట్‌పై స్పష్టత ఇచ్చినప్పటికీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అందరు నాయకులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని గౌరు దంపతులకే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. 

మొత్తంగా గౌరు కుటుంబానికి పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల ఎంపీ టికెట్‌పై స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది.