గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ స్టార్ కాంపైనర్ వంగవీటి రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఒక నియంత అంటూ ధ్వజమెత్తారు. 

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాధా ఒక నియంతకు అధికారం అప్పగిస్తే ఏమవుతుందో అన్న ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్నీ ఆలోచించాకే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. 

నాన్న వంగవీటి రంగా అభిమానులంతా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. జగన్‌ అధికారంలోకి వస్తే తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. జగన్ నియంతలా, అహంబావిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చెయ్యమంటాడో, ఎప్పుడు రోడ్డెక్కమంటాడో, తాను ఎప్పుడు రోడ్డు ఎక్కి దిగుతాడో వారికే తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచాక కూడా అసెంబ్లీకి రాని చెప్తాడేమోనన్న భయం జనంలో ఉందన్నారు. 

నిలకడలేని వారితో ఎప్పటికైనా చిక్కులు తప్పవని జనం దీనిపై ఆలోచించాలని రాధా కోరారు. కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని వేమూరు టీడీపీ అభ్యర్థి మంత్రి నక్కా ఆనందరావు స్పష్టం చేశారు.

 బీసీల్లో చేర్చే విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అడ్డుపుల్ల వేసిందని తెలిపారు. కాపులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ రిజర్వేషన్ 10శాతంలో 5శాతం కాపులకే కేటాయించామంటే ఎంత పెద్దపీట వేశామో కాపు సోదరులు గ్రహించాలని మంత్రి ఆనందబాబు కోరారు.