అమరావతి: ఈవిఎంల పనితీరుపై హరిప్రసాద్ అనే నిపుణుడితో చర్చించడానికి తాము సిద్ధంగా లేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనడంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈవిఎంల పనితీరుపై ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రతినిధుల బృందంలో హరిప్రసాద్ వేమూరి ఉండడంపై సునీల్ అరోరా స్పందించిన విషయం తెలిసిందే.

ఈవిఎం చోరీ కేసులో నిందితుడైనందున హరిప్రసాద్ తో చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని, ఇతర నిపుణులను ఎవరినైనా పంపించాలని ఆయన చెప్పారు. 2010లో ఈవిఎంను చోరీ చేసిన కేసులో హరిప్రసాద్ నిందితుడని ఈసీ తెలుగుదేశం పార్టీకి లేఖ రాసింది. 

ఈవిఎంలు, వివీ ప్యాట్ ల పనితీరుపై చర్చించడానికి ఇష్టం లేకనే ఈసీ హరిప్రసాద్ ను సాకుగా చూపుతోందని టీడీపి వర్గాలంటున్నాయి. ఈవిఎంలు, వివీ ప్యాట్ ల పనితీరుపై చర్చించేందుకు ఈసి సిద్ధంగా లేదనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది.