చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ హ్యాండిచ్చారు. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థిగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోదరి పద్మజకు వైసీపీ టికెట్ ఖరారైనట్లుగా సమాచారం.

సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ చివరి నిమిషం వరకు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దీనిపై మంగళవారం లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు లోపలికి ఎంట్రీ మాత్రం దొరకలేదు.

సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం సునీల్‌ను చూసి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనిపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు జిల్లాలోని మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనప్పటికీ పూతలపట్టులో మాత్రం ఏ ఒక్క పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించలేదు.

2014 ఎన్నికల్లో పలమనేరులో డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్‌ను జగన్ రంగంలోకి దించారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారిని టీడీపీ బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో లలిత కుమారిపై 624 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సునీల్ గెలుపొందారు.

2009లో సైతం అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రవిపై కూడా లలిత స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. వరుసగా రెండుసార్లు ఓటమి చెందడంతో మూడోసారి ఎలాగైనా గెలవాలని లలితకుమారి పట్టుదలతో ఉన్నారు.

అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి టీడీపీలో ఆశావహుల లిస్ట్ భారీగానే ఉంది. ఈమెకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఎంపీ జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి అండదండలు పుష్కలంగా ఉండటంతో టికెట్ దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు అండగా ఉంటారనుకున్న డాక్టర్ సునీల్‌కు మంగళవారం లోటస్‌పాండ్‌లో జరిగిన అవమానంతో ఆశలు సన్నగిల్లాయి.