వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ సహకారంతో సాక్షి పేపర్ ద్వారా  ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ఐపీఎస్ అధికారుల బదిలీపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సాక్షీ మీడియాలో వస్తున్న కథనాలను పెయిడ్ న్యూస్‌‌గా పరిగణించాలని ఆయన ఎన్నికల కమిషన్‌కు కోరారు. ఏపీ, తెలంగాణల్లో ఉన్న 20 సాక్షి యూనిట్ల ద్వారా నగదును తరలిస్తున్నారని రవీంద్రకుమార్ ఆరోపించారు.

2016 జార్ఖండ్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ డీజీ పాత్ర ఉందని తేలడంతో ఎన్నికల సంఘం అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందని గుర్తు చేశారు. పోలీసుల అధికారులపై విచారణ లేకుండా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించారని.. అయితే వారిపై విచారణ తీసుకుని చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘానికి వివరించమన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలకు టీడీపీ తూట్లు పొడిచిందంటూ ఇవాళ కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీపై కనకమేడల విమర్శలు కురిపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటకు ఎందుకు తిలోదకాలు ఇచ్చారంటూ రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్  ప్రజలకు సంజాయిషీ చెప్పుకుని ఆ తర్వాత తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని తిట్టడానికే మోడీ ఏపీకి వస్తున్నారని కనకమేడల ఎద్దేవా చేశారు.