అధికారంలోకి వస్తే బీసీలకి ఏం చేస్తారన్నది మేనిఫెస్టోలో జగన్ ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల గురించి మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొనలేదని... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విదేశాలకు వెళ్లి చదువుకోవడం జగన్ ఇష్టం లేదని ఆరోపించారు.

బీసీలను పేదరికంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారని... టీడీపీ అధికారంలోకి వస్తే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.

వైసీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి అసలు ప్రస్తావించలేదని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత అంటే జగన్‌కు చిన్న చూపని... అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ గురించి వైసీపీ ప్రస్తావించకపోవడం దారుణమని, సంపద సృష్టి, ఉపాధి కల్పనపై జగన్‌కు అవగాహన లేదని రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.