సినీనటుడు మోహన్‌బాబుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైరయ్యారు. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసిన మోహన్ బాబు.. దాని గురించి మాట్లాడకుండా పసుపు-కుంకుమ గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

ఏదో ఒక పార్టీ అండ కావాలనే ఉద్దేశ్యంతోనే మోహన్ బాబు వైసీపీలో చేరారని వెంకన్న ఆరోపించారు. అన్న గారి చెప్పుకుంటూ ఆయన పార్టీ వారసుడైన చంద్రబాబును విమర్శించడం ఏంటన్నారు.

వయసు మీద పడ్డాక నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రిని తిడితే పెద్దవారవుతారని మోహన్ బాబు భావిస్తున్నారని.. అయితే చంద్రబాబును విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.

సినిమా డైలాగులు కట్టిపెట్టి ఆయన ఇంట్లో కూర్చుంటే మంచిదని.. ముఖ్యమంత్రి గురించి తప్పుగా మాట్లాడితే... ఘాటుగా స్పందించాల్సి వస్తుందని... తాము విమర్శించడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరని బుద్దా హెచ్చరించారు.