మే 23న చంద్రబాబు నాయుడుకి పట్టాభిషేకం జరగడం ఖాయమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
మే 23న చంద్రబాబు నాయుడుకి పట్టాభిషేకం జరగడం ఖాయమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలు రాకుండానే వైసీపీ నేతలు దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి వాళ్లు వస్తే.. ప్రజలు బతకగలరా.. రక్షణ ఉంటుందా అని బుద్ధా ప్రశ్నించారు. ఈవీఎం లోపాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే ఆయనకు ఓటమి భయం పట్టుకుందంటూ ప్రతిపక్ష నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారని వెంకన్న మండిపడ్డారు.
ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడితే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బాగా పనిచేశాయంటూ కితాబివ్వడమేంటన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తారేమోనంటూ వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాల్లోనైనా ఎన్నికలు సజావుగా జరగాలని చంద్రబాబు పోరాటం చేస్తున్నారని వెంకన్న స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్న వారైతే ముఖ్యమంత్రి అసలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే వారే కాదన్నారు.
