గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను నూటికి 99 శాతం అమలు చేశామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. చంద్రబాబు హామీలపై వైఎస్ జగన్ సోదరి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ కౌంటరిచ్చారు.

షర్మిల ఇన్నాళ్ల తర్వాత బయటకొచ్చి మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం గత ఎన్నికల్లో ఆయన్నే గాయపరిచి వెళ్లిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇప్పుడు మరోసారి జగన్ అమ్ములపొదిలోంచి బయటకు వచ్చిన బాణం.. తిరిగి ఆయననే నష్టపరుస్తుందని రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఐటీశాఖ కేటీఆర్‌కు ఇచ్చారని, ఏపీలో ఆ శాఖను నారా లోకేశ్‌కు ఇచ్చారన్న షర్మిల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

ఒకరిని చూసి లోకేశ్‌కు పదవి ఇవ్వనక్కర్లేదని ఆయనకు ఆ సత్తా ఉందని తెలిపారు. లోకేశ్‌కు ఐటీ శాఖలో 57 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని మరి కేటీఆర్‌కి ఎన్నోచ్చాయని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖల బాధ్యతలు స్వీకరించిన తర్వాత 106 అవార్డులు వచ్చాయని ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని నీతిఅయోగ్ స్పష్టం చేసిందని రాజేంద్రప్రసాద్ గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 11 జాతీయ ప్రాజెక్టులు పదేళ్లలో 25 శాతం కూడా పనులు పూర్తి చేసుకోలేదని కానీ పోలవరం మూడేళ్లలోనే 66 శాతం పనులను పూర్తి చేసుకుందన్నారు.

అవినీతికి జగన్, అభివృద్దికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్లని రాజేంద్రప్రసాద్ అన్నారు. జగన్ తన ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్, మోడీలను పల్లెత్తు మాట కూడా ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు.

పవన్ ధైర్యంగా మోడీ, కేసీఆర్‌ల గురించి మాట్లాడారని జగన్‌కు ఆ మాత్రం దమ్ము కూడా లేదని రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. టీడీపీకి ఎవరితో లాలూచీలు, ముసుగు రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.