గుంటూరు: గుంటూరు జిల్లా రాజకీయాల్లో వారికంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వెలుగొందుతున్నారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న వారు ఇటీవలే వియ్యంకులు సైతం అయ్యారు. 

2019 ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇంతకీ ఆ ఇద్దరు వియ్యంకుల స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం. జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. 

వినుకొండ నుంచి 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు జీవీ ఆంజనేయులు. ఇకపోతే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కొమ్మాలపాటి శ్రీధర్. వీరిద్దరు మధ్య రాజకీయ బంధమే కాకుండా వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. 

రాజకీయ స్నేహంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారరంగంలో కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని కాస్త బంధుత్వంగా మార్చుకున్నారు. జీవీ ఆంజనేయులు కుమార్తెను పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. 

ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండుసార్లు గెలిచారు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిద్ధామనుకునే సమయంలో ఓటర్లు వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వినుకొండ నుంచి పోటీ చేసిన జీవీ ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. 

ఇకపోతే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ తన సమీప ప్రత్యర్తి వైసీపీ అభ్యర్థి నండూరి శంకరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు.