పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం.. విడివిడిగా పోటీచేస్తున్నారు. అయినప్పటికీ.. పవన్, టీడీపీ చీకటి ఒప్పందం చేసుకుందంటూ వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. కాగా.. ఈ ఆరోపణలు నిజమనిపించేలా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేశారు.

పవన్‌, బాబు మధ్య ఉన్న దోస్తానా గురించి పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ బయటపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్‌ మన స్నేహితుడే.. అంతా కలిసే పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఇక విశాఖజిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, పార్టీ కీలక నేత మెట్ల రమణబాబు కూడా టీడీపీ, జనసేన బంధాన్ని బయటపెట్టారు. 

పవన్‌, చంద్రబాబు కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గండి రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో రమణబాబు మట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసే ఉన్నారు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా ఏమీ లేరు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయింది. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉన్నారు’ అన్నారు.