టీడీపీకి మరో అభ్యర్థి షాక్ ఇచ్చాడు. ఇటీవల టీడీపీ నుంచి టికెట్ ఖరారు చేసిన తర్వాత.. అదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో అభ్యర్థి కూడా టీడీపీకి షాక్ ఇచ్చాడు. తాను అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆయనే శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.

ఆయన స్వగ్రామం వెలుగోడు మండలం వేల్పనూరులో సోమవారం రాత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వారికి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశానని, మన్నించాలని కోరారు. తన కుటుంబ పరిస్థితులు, తన సతీమణి బుడ్డా శైలజ ఆనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వివరించారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో తన భార్యకు, కార్యకర్తలకు న్యాయం చేయలేనన్న మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, ఆశ్రయం ఇచ్చిన టీడీపీకి తీరని నమ్మకద్రోహం చేశానని ఉద్వేగానికి గురయ్యారు. తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తమ కుటుంబంలో ఎవరికైనా టిక్కెట్‌ ఇస్తే, వారి గెలుపునకు కృషిచేస్తానని అన్నారు. 

ఇప్పుడు బుడ్డా తీసుకున్న నిర్ణయంతో పార్టీ అధిష్టానం ఆలోచనల్లో పడింది. మరో స్ట్రాంగ్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వాలని చూస్తోంది.