కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పై కన్నేసింది తెలుగుదేశం పార్టీ. కాపు ఉద్యమ నేతగా, రాజకీయ వేత్తగా రాజకీయాలను ప్రభావితం చేసే ముద్రగడను పార్టీలోకి తీసుకుంటే కాపు సామాజిక వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చునని ప్లాన్ వేసింది. 

టీడీపీ కీలక నేత అయిన కుటుంబరావును రాయబారిగా పంపింది టీడీపీ అధిష్టానం. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయన ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపు ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోతుందని భావించిన తెలుగుదేశం పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులువేస్తూ వంగవీటి రాధాకృష్ణను పార్టీలో చేర్చుకుంది. 

తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించాలని భావించారు. ఈ సందర్భంగా ముద్రగడ నివాసంలో ఈ అంశంపై ఏకాంతంగా చర్చలు జరిపారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. కాపు రిజర్వేషన్ల సాధనయే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో అన్న అంశంపై జేఏసీ ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించేశారని తెలుస్తోంది. ఇకపోతే ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తారని కాసేపు, జనసేనలోకి వెళ్తారని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు. 

కానీ ముద్రగడ నాడిని పట్టుకోవడం మాత్రం సాధ్యంకావడం లేదు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబును అభినందిస్తూ లేఖ రాశారు. ఆ తర్వాత అనేక ప్రశ్నలు సంధిస్తూ లేఖలతో విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. ఇకపోతే ముద్రగడను తమ పార్టీవైపుకు తిప్పుకునేందుకు వైసీపీ కూడా ప్రయత్నిస్తోందని సమాచారం. కాపు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ముద్రగడ పద్మనాభం వెంటే ఉన్నారు. 

దీంతో ముద్రగడ వెనుక వైసీపీ ఉందంటూ టీడీపీ ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరతారా లేక సైకిలెక్కుతారా అన్న చర్చ జరుగుతోంది. లేని పక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ముద్రగడ నిర్ణయం ఎలా ఉండబోతుందో అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.