ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ మేజిక్ ఫిగర్ ని చేరుకుంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ కనీసం 25 సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో పడిపోయింది. ఈ దెబ్బతో టీడీపీ పని అయిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.

జగన్ యువ నాయకుడు కాబట్టి... అతను 10ఏళ్లుగా అధికారం లేకపోయినా నిలదొక్కుకోగలిగాడు. చివరకు విజయం సాధించి సీఎం అవ్వాలనే తన కల నెరవేర్చుకుంటున్నారు. టీడీపీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నిజాలు మాట్లాడుకుంటే... టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయన లాంటి గట్టి నాయకుడు పార్టీలో ఒక్కరు కూడా లేరు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే స్థితిలో లేరు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినా... విజయం సాధించలేదు. మొన్నటి వరకు మంత్రిగా విధులు నిర్వహించినప్పటికీ... తన పనితీరుతో లోకేష్ ప్రజలను ఆకట్టుకోలేకపోయాడు. 

ఇక పోతే చంద్రబాబుకి వయసు అయిపోయింది. మహా అంటే ఈ ఐదేళ్లు ఆయన ప్రతిపక్ష హోదాలో రాణించగలరేమో. కానీ ఆతర్వాత ఇంత స్ట్రాంగ్ గా ఉంటారనే నమ్మకం లేదు. ఆయన బావమరిది బాలకృష్ణ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నా... ఎమ్మెల్యేగా ఆకట్టుకోలేకపోయారనే వాదనలు ఉన్నాయి. పార్టీలో ఏ ఇతర నాయకులు కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థానం తీసుకునే స్థాయిలో లేరు. ఈ నేపథ్యంలో ఒకరి పేరు బాగా వినపడుతోంది.

సర్గీయ నందమూరి తారకరామారావు మనవడు, హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోతే... టీడీపీ పేరు చరిత్రలోనే మిగిలిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వచ్చి... టీడీపీ పగ్గాలు చేపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ మాట చాలా మంది అభిమానుల మనసుల్లోనే ఉంది. అయితే... తాజాగా ఈ విషయాన్ని నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదిక బహిర్గతం చేశాడు.

స్వతహాగా... బ్రహ్మాజీ ఎన్టీఆర్ కి మిత్రుడు. అంతేకాకుండా ఒక అభిమానిలాగా తారక్ ని ప్రేమిస్తున్నాడు. అందుకే అభిమానుల మనసులో ఉన్న మాటను తన మాటగా బయటపెట్టాడు. ఇక టీడీపీని మన తారక రాముడే కాపాడాలి అని పేర్కొన్నాడు. కాగా ఆయన ట్వీట్ కి నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన వస్తుండటం విశేషం.