ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గెలవాలంటే రౌడీయిజం అయినా చెయ్యాలని ఒకరంటే గెలిచిన తర్వాత ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదాం అంటూ మరో టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు హద్దుమీరుతూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటికైనా వెనకడామన్న రీతిలో టీడీపీలోని కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా  టీడీపీ మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించేందుకు పోరాడుదామని పిలుపునిచ్చారు. అవసరమైతే రౌడీయిజం చేద్దామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆ వ్యాఖ్యలను సరిచేసుకోవాల్సింది పోయి సమర్థించుకునే ప్రయత్నం చేశారు కూడా. అందులో తప్పేం లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇకపోతే ఆరు రోజుల క్రితం ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 

చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయితే మనకు తిరుగు ఉండదంటూ కార్యకర్తలతో ఎమ్మెల్యే సూరి చెప్పుకొచ్చారు. కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచే ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదామంటూ వ్యాఖ్యానించారు. 

అందుకు సంబంధించి ఆడియో టేపులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా ఉండేందుకు పోలీసులకు ముందే ఆదేశిస్తామంటూ చెప్పుకొచ్చారు. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రత్యర్థులను అంతమెుందిద్దామంటూ వరదాపురం సూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలవరపాటుకు గురి చేశాయి. ఆ వ్యాఖ్యలు మరవకుమందే మరో నేత రౌడీయిజం చేసైనా చంద్రబాబు నాయుడు గెలిపించాలంటూ దివి శివరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.