అవనిగడ్డ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీ గూటికి చేరిపోయారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అంబటి శ్రీహరిప్రసాద్ తండ్రి అంబటి బ్రహ్మణయ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఒకసారి అంబటి శ్రీహరి ప్రసాద్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. 

అయితే రాష్ట్రవిభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ కు ఇచ్చినట్లు తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా మండలి బుద్ధ ప్రసాద్ కే టికెట్ కేటాయించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్‌ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంబటికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీహరి ప్రసాద్ మొదట నుంచి టీడీపీలో ఉన్నా చంద్రబాబు గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు అంబటి శ్రీహరి ప్రసాద్.