అనంతపురం: అనంతపురం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హిందూపురం పార్లమెంటు సీటుకు కూడా ఆయన అభ్యర్థిని ఖరారు చేశారు. 

దాదాపుగా సిట్టింగులందరికీ అవకాశం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప మళ్లీ బరిలోకి దిగుతారు. హిందూపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి పోటీ చేస్తారు. 

పెనుగొండ నుంచి పార్థసారధి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్‌రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిర నుంచి వీరన్న పోటీ చేస్తారు. రాప్తాడు నుంచి మళ్లీ పరిటాల సునీత పోటీ చేస్తారు.
 
కదిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కదిరిని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. కదిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్‌భాషా, కందికుంట ప్రసాద్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో చాంద్‌భాషా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు.