కర్నూల్: కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం నాడు కార్యకర్తలతో భేటీ అయ్యారు. కర్నూల్  స్థానం నుండి టీడీపీ టిక్కెట్టును టీజీ భరత్‌కు చంద్రబాబునాయుడు కేటాయించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నుండి కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఓటమి పాలయ్యాడు.ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల  నేపథ్యంలో  ఎస్వీ మోహన్ రెడ్డి కూడ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 

కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి పోటీ చేసేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీ టిక్కెట్టు కోసం మోహన్ రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. సర్వే ఫలితాల ఆధారంగా టీడీపీ టిక్కెట్టును చంద్రబాబునాయుడు టీజీ భరత్‌కు కేటాయించారు.

టిక్కెట్టు దక్కకపోవడంతో ఎస్వీ మోహన్ రెడ్డి అలకబూనారు.  గురువారం నాడు కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇండిపెండెంట్‌గా ఎస్వీ మోహన్ రెడ్డి బరిలోకి దిగుతారా,  మరో పార్టీ వైపు చూస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇవాళ కార్యకర్తల భేటీ తర్వాత ఎస్వీ మోహన్ రెడ్డి తన కార్యాచరణను ప్రకటించే అవకాశం లేకపోలేదు.