విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో చాలా రోజుల క్రితం చెప్పారు. కానీ ఆయన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని అంటున్నారు. 

తూర్పు గోదావరి లేదా విశాఖపట్నం జిల్లాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో గాజువాక సీటుపై, తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం సీటుపై ఆయన కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో పవన్ పోటీ చేసే స్థానంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

కాగా, పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు పవన్ కల్యాణ్ మంగళవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహర్, శివశంకర్ తదితర నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపు ఆయన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇదిలావుంటే, సీట్ల సర్దుబాటుపై ఆయన మంగళవారం సాయంత్రం వామపక్ష నేతలతో చర్చలు జరుపుతారని సమాచారం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోనూ సిపిఎం నేత మధుతోనూ ఆయన మంగళవారం సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది.