జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవైరెడ్డి షాక్ ఇవ్వనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తర్వాత అధికార టీడీపీలోకి జంప్ చేశారు.

అయితే.. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఎస్పీవైరెడ్డి పవన్ కి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది.

జనసేన అనూహ్యంగా ఎస్వీవైరెడ్డి కుటుంబానికి ఏకంగా మూడు టికెట్లిచ్చింది. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగగా.. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. 

అయితే మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్పీవైరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అలాగే టీడీపీ విజయానికి కృషి చేయాలని సీఎం కోరారు. దీంతో ఆయన యూటర్న్ తీసుకోబోతున్నట్లు సమాచారం. జనసేన తరుపున వేసిన మూడు నామినేషన్లు ఎస్పీవైరెడ్డి కుటుంబం ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది.