గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గం తనదేనని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. సత్తెనపల్లి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈనెల 22న నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. 

తనకు రెండోసారి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబంలాంటిదని చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు సహజమేనని చెప్పుకొచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అందరూ కలిసి పని చేసి తనను గెలిపించారని, ఈ ఎన్నికల్లోనూ అలాగే కలిసి పనిచెయ్యాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపును చూసి వైసీపీ వాళ్లు ముక్కున వేలు వేసుకోవాల్సి ఉంటుందని కోడెల శివప్రసాదరావు  తెలిపారు.