వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు.. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కౌంటర్ ఇచ్చారు. విజయమ్మ.. తన కుమారుడికి ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నారని.. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే.. తమ పిల్లలు జైలు పాలు అవుతారని ఆమె అననారు.

శనివారం సాధినేని యామిని మీడియాతో మాట్లాడారు. జగన్ కుటుంబంలో అందరూ తేడానే అని ఆరోపించారు. ‘‘కొన్ని వలస పక్షులను పులికాట్ సరస్సు వద్ద చూస్తుంటాం. నిర్ణీతమైన సమయంలోనే అవి బయటకు వచ్చి, వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు.’’ అని ఆమె అన్నారు.

‘‘ మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం. కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడాను ఎదుర్కొంటున్నారు. మొన్న షర్మిల వచ్చి ఏదో మాట్లాడారు. నిన్న తల్లిగారు విజయలక్ష్మిగారిని దింపారు. ఆవిడ ఒక చేతిలో బైబిల్ పట్టుకుని.. మరో చేతిలో మైక్ పట్టుకుని చెబుతూ ఉంటారు. ‘నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి’ అని చెబుతున్నారు.’’ అని యామిని అన్నారు.

వైఎస్ పోతూ పోతూ.. రాష్ట్రాన్ని తన చేతిలో పెట్టి వెళ్లారని జగన్ చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం తన చేతిలోకి అప్పనంగా వచ్చేసిందని జగన్ భ్రమపడుతున్నాడని ఆరోపించారు.   జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే... రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటుందన్నారు.