అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ సంపాదించిన అవినీతి సొమ్ములో షర్మిలకు వాటా ఉందని చెప్పుకొచ్చారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన యామిని రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పసుపు-కుంకుమ కింద పదివేలు ఇస్తున్న విషయం తెలియదా అని షర్మిలను ప్రశ్నించారు. చుట్టపు చూపుగా వచ్చిన షర్మిలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్న షర్మిల నోటిని అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు. ఏనాడూ పోలవరం ప్రాజెక్టును సందర్శించని మీరు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీపై మోదీ, కేసీఆర్ చేస్తున్న కుట్రలో జగన్ భాగస్వామి అని ఆరోపించారు. మరోవైపు సినీ రచయిత కోన వెంకట్‌పైనా యామిని మండిపడ్డారు. బ్రాహ్మణులు అంతా వైసీపీకి మద్దతు పలుకుతున్నారని కోన వెంకట్ అనడానికి ఆయన ఎవరంటూ విరుచుకుపడ్డారు. బ్రహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని యామిని వివరించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా టీడీపీ వైపే ఉందని సాధినేని యామిని స్పష్టం చేశారు.