అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత సాధినేని యామిని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓడిపోవడం ఖాయమన్నారు. 

ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టమేనన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన యామిని కడప స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం అన్యాయం చేస్తుంటే వైఎస్ జగన్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

నిధులపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో ముందు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని నిలదీశారు. రాయలసీమలో తిరిగే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి జగన్‌కు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలెవ్వరూ వైసీపీకి ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. జగన్‌ కేసుల బాగోతం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందని యామిని విమర్శించారు.