గుంటూరు: నర్సరావుపేట పార్లమెంట్ సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబునాయుడు ఎటూ తేల్చకపోవడంతో  రాయపాటి కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీకి గుడ్‌బై యోచనలో రాయపాటి కుటుంబం ఉంది. అనారోగ్యం కారణంగా రాయపాటి సాంబశివరావుకు నర్సరావుపేట ఎంపీ స్థానం కేటాయింపు విషయమై చంద్రబాబు వెనకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి  తాను పోటీ చేసేందుకు రాయపాటి సాంబశివరావు సుముఖంగా ఉన్నా కూడ చంద్రబాబునాయుడు ఈ విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తనకు నర్సరావుపేట ఎంపీ స్థానం ఇవ్వకపోతే తన కొడుకుకు సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు కోరుతున్నారు.

అయితే సత్తెనపల్లి నుండి తాను పోటీ చేస్తున్నట్టుగా కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీట్ల కేటాయింపులో అన్యాయం చోటు చేసుకొందని  రాయపాటి ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఈ  విషయమై రాయపాటి సాంబశివరావు ఇవాళ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

తన కుటుంబానికి టిక్కెట్ల కేటాయింపు విషయమై న్యాయం జరగకపోతే పార్టీ వీడాలని కూడ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. కానీ, మీడియా సమావేశంలో రాయపాటి సాంబశివరావు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.