అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారథి,నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులు టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఉన్న వీరు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న అనుమానంతో వారు రాజీనామా చేశారు. 

టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. మరోవైపు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చెయ్యలేదు. పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 

ఇకపోతే తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించింది. అయితే సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఆ పదవిని స్వీకరించలేదు. దీంతో ఆ పదవిని రద్దు చేశారు.