మండపేట: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బుధవారం నాడు జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకొంది. గోడ కూలిన ఘటనలో పిల్లి రాములమ్మ మృతి చెందింది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  మండపేటలో బుధవారం నాడు  ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనేందుకు గాను పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ భవనం పిట్ట గోడను జనం ఎక్కారు. 

దీంతో ఆ భవనం పిట్టగోడ కూలింది. దీంతో 30 మందికి పైగా గాయపడ్డారు.  గాయపడిన వారిని మండపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లి రాములమ్మ మృతి చెందింది . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే గాయపడిన వారిని ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు.