శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కేటాయింపు పార్టీ అధినేత చంద్రబాబుకు కత్తిమీద సాములా తయారైంది. పార్టీలోకి వచ్చిన నేతల నుంచి మెుదలుకుని సీనియర్ నేతల వరకు అంతా చంద్రబాబుకు చుక్కలు చూపించారు. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీలో టికెట్లు దక్కించుకోకపోవడంతో అనేకమంది అలకబూనారు కూడా. ఇప్పటికీ సీట్లపై టీడీపీలో రచ్చ జరుగుతూనే ఉంది. ఎవరు ఎలా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం ఎంపీ అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మాత్రం మంచి ఖుషీగా ఉంది. 

ఎందుకంటే మెుదటి విడతలోనే అత్యధిక స్థానాలు దక్కించుకుంది కింజారపు ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్యాకేజీ కోసం పార్టీకి చెందిన సీనియర్లు ఎంతకొట్లాడినా అవకాశం దక్కించుకోలేకపోయారు. 

కానీ కింజారపు ఫ్యామిలీ మాత్రం టికెట్లు దక్కించుకుంది. ఏ గొడవ చెయ్యలేదు. అభ్యర్థనలు చెయ్యలేదు. సైలెంట్ తమ  పని తాము చేసుకుపోయింది. అంతే మెుదటి విడత జాబితాలోనే స్థానాలు దక్కించుకుని మస్త్ ఎంజాయ్ చేస్తోంది. 

మాజీ ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. టీడీపీలో నెంబర్ 2 స్థానంగా కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకు రాజకీయాలు నడిపిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు. ఆయన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ చర్చ జరిగింది. 

అయితే కొడుకు రామ్మోహన్ నాయుడు, సోదరుడు అచ్చెన్నాయుడు టీడీపీలో తమ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు.  గతంలో ఎర్రన్నాయుడుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో అంతే ప్రాముఖ్యతను రామ్మోహన్ నాయుడుకు ఇస్తుందని ప్రచారం. ప్రచారం కాదు నిజం కూడా. 

2019 అభ్యర్థుల ఎంపికలో కింజారపు ఫ్యామిలీకి అత్యధిక స్థానాలు కేటాయించి ఆ అభిమానాన్ని నిరూపించుకున్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పారటీ నుంచి పోటీ చేసి గెలుపొందారు రామ్మోహన్ నాయుడు. 

ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన పార్లమెంట్ లోనూ బయట టీడీపీ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు. ఏదైనా సబ్జెక్టు మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నారు రామ్మోహన్ నాయుడు. 

సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు మనసు గెలుచుకున్న యువ ఎంపీగా చెప్పుకుంటారు టీడీపీ నేతలు. అయితే 2019 ఎన్నికల్లో కూడా రామ్మోహన్ నాయుడుకే శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 

కింజారపు ఫ్యామిలీ నుంచి మరో టికెట్ మంత్రి అచ్చెన్నాయుడు. 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు కేబినేట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎత్తైన మనిషి, నోరు పెద్దది కావడంతో అసెంబ్లీలో ఆయన గురించి ప్రత్యేక చర్చ జరిగిందంటే నమ్మండి. 

ఇకపోతే మరో టికెట్ సాధించుకున్న వ్యక్తి భవానీ. రామ్మోహన్ నాయుడు సోదరి అయిన భవానీ రాజమహేంద్రవరం అర్బన్ టికెట్ దక్కించుకున్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. 

ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు వాసు భార్య. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం అర్బన్ టికెట్ ఆదిరెడ్డి భవానీకి కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారానికి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు పాల్గొంటారని ప్రచారం కూడా జరుగుతోంది. 

ఇకపోతే పెందుర్తి టీడీపీ అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకున్నారు బండారు సత్యనారాయణ మూర్తి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన బండారు సత్యనారాయణ మూర్తి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్వయానా పిల్లనిచ్చిన మామ. 

బండారు సత్యనారాయణ ద్వితీయ కుమార్తెను రామ్మోహన్ నాయుడుకు ఇచ్చి వివాహం చేశారు. దీంతో బండారు సత్యనారాయణ మూర్తి కింజారపు ఫ్యామిలీలో సభ్యుడై పోయారు. తొలివిడత జాబితాలో బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ దక్కకపోవడంతో రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగి టికెట్ దక్కేలా చక్రం తిప్పారని ప్రచారం కూడా ఉంది. 

ఇలా కింజారపు ఫ్యామిలీ బంధుగణం అంతా టికెట్లు దక్కించుకోవడంతో ఆ ఫ్యామిలీ మంచి ఖుషీగా ఉందట. మెుత్తానికి చూస్తే కింజారపు రామ్మోహన్ నాయుడు మంచి జోష్ లో ఉన్నారు. తనతోపాటు బాబాయ్ అచ్చెన్నాయుడు, సోదరి భవానీ, రామ్మెహన్ నాయుడుకు పిల్లనిచ్చిన మామ బండారు సత్యనారాయణ మూర్తి టికెట్లు దక్కించుకోవడంతో గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారట.