కడప: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చెయ్యనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన నామినేషన్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయనే అనుమానంతో టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చెయ్యనున్నారని టాక్. 

బుధవారమే రాజీనామా చెయ్యాలని భావించినప్పకటికీ కొందరు అభ్యంతరం చెప్పడంతో ఆగినట్లు తెలుస్తోంది.  టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మెుత్తం ధర్మకర్తల మండలి పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని ఆలోచించి రాజీనామా చెయ్యాలని కొందరు సూచించారు. 

చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే పాలకమండలి రద్దు అవుతుందని కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆలోచనలో పడ్డారట పుట్టా సుధాకర్ యాదవ్. 

అయితే ఇప్పటికే  ప్రస్తుత పాలకమండలి సభ్యులు బి.కె.పార్థసారథి, బొండా ఉమామహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వం, టీటీడీ వారి రాజీనామాలను ఆమోదించింది కూడా.  అయితే గురువారం పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.