ముఖ్యమంత్రికో నీతి, లోకేశ్‌కో నీతి, పోసానికో నీతి ఉంటుందా అన్నారు ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో తాను కూడా పౌరుడినేనని సామాన్యుడినని తనకు లెటర్ పంపిస్తారా అంటూ ఫైరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ కులం, ఏ మతం వాళ్లు కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని పోసాని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దొంగని, ఆబద్ధాలకోరని, అవినీతిపరుడని, విలువల్లేని వ్యక్తని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఓటేస్తే.. కమ్మ రాజ్యానికి ఓటేసినట్లేనని పోసాని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేసి గెలిపిస్తే ఏపీ మరోసారి కమ్మ రాష్ట్రం అయిపోతుందని పోసాని ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే కాపులకు ఓటేసినట్లేనని.. ఆ సామాజిక వర్గం పవర్‌లోకి వస్తే మరోకరిని ఎదగనివ్వరని టీడీపీ జనాల్లో ప్రచారం చేసిందని పోసాని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ వల్ల గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి నేడు ఆయనని తన పార్టీ నేతలతోనే చంద్రబాబు తిట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఎలాంటి సినిమా తీయడం లేదని.. ఏ టైటిల్ పెట్టలేదని, అందుకు సంబంధించిన ప్రెస్‌మీట్ సైతం పెట్టలేదని పోసాని స్పష్టం చేశారు.

ఈ విషయం గురించి ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేశానని పోసాని తెలిపారు. తాను వైసీపీ మద్ధతుదారుని కాబట్టే తనను వేధింపులకు గురిచేస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.